Friday 23 November 2012

పొత్తిల్లలోంచి...

నాకు రెండేళ్ళు వచ్చేవరకు 

అమ్మ అన్నం తినిపిస్తూ 

ఆకాశాన్ని నేలకు దింపేది 

చందమామని నా అరచేతిలో ఉంచేది 

నేను బొమ్మల పుస్తకం 

చూస్తున్నప్పుడు 

అమ్మ తన జీవితాన్ని 

రంగురంగుల ప్రపంచం మీదకి పరిచేది..

పుస్తకంతో పాటు 

నా జీవితాన్ని రంగులమయం 

చేయాలని ఉబాలాటపాడేది 

భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతున్నట్లు 

నేను ఇల్లంతా అమ్మ కొంగుపట్టుకుని 

తిరుగుతుంటే 

వీడే వృద్దాప్యంలో 

ఊతకర్ర అనుకుందేమో 

ఎప్పుడూ కసురుకోలేదు 

ఎప్పుడూ విసుక్కోలేదు 

స్కూల్లొ చేర్పించి 

ప్రతి రోజు తల దువ్వి 

బట్టలేసి, భుజాన సంచి తగిలించి 

టాటా చెబుతూ 

నేను ఉన్నతాసనం మీద కూర్చున్నట్లు 

కళ్ళింత చేసుకుని 

కలలు కనేది.

డిగ్రీ పూర్తి చేసి 

అమ్మ చేతిలో పెట్టి 

కాళ్ళకు దణ్ణం పెట్టినప్పుడు 

అడ్డాలనాడు కాదు గెడ్డం వచ్చినా నా ముద్దు బిడ్డవే

అని ఆశీర్వాదపు అక్షతలు జల్లేది.

నాన్న వదిలేసిన

బాధ్యతల్ని భుజాన వేసుకుని 

పరిగెడుతున్న నన్ను చూసి 

అమ్మ కళ్ళు చెమర్చేవి 

నేనో ఇంటివాడినై 

ఏడాది తిరక్కుండానే 

ఓ బాబుని అమ్మ చేతిలో ఉంచినప్పుడు 

నాన్న ప్రతిరూపన్ని చూసుకుని 

చిన్ని చిటికిన వేలుకి 

చిన్న బంగారపు ఉంగరమై 

చట్టుక్కున మెరిసి 

ఆపాత మధుర స్వప్నమయ్యింది.

అప్పుడెప్పుడో 

అమ్మ నానోటికందించిన 

అమృత బిందువుల్లాoటి 

చనుబాల చుక్కలే 

ఇప్పటి 

నా నాలుక మీద 

ఈ కవిత్వాక్షరాలు...